అనకాపల్లి జిల్లా నర్సీపట్నం
దివ్య దర్శిని న్యూస్
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో లంచాల ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి బొంతు రమణ
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఓ బాధిత మహిళ నుంచి ఆస్పత్రి సిబ్బంది రూ.100 లంచం డిమాండ్ చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ బొంతు రమణ పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళ స్వయంగా సిబ్బంది డబ్బులు అడుగుతున్నారని చెప్పడం చాలా తీవ్రమైన అంశమని అన్నారు.
అదేవిధంగా చిన్నపిల్లల డెలివరీ కేసుల విషయంలో అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని బొంతు రమణ తెలిపారు. పేద ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు నమ్మకంతో వస్తుంటే, అక్కడ ఇలాంటి పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమని అన్నారు.
ఈ నేపథ్యంలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో పూర్తి స్థాయి విచారణ నిర్వహించి, ఆస్పత్రి సిబ్బంది వ్యవహారంపై సమగ్ర ఇంక్వైరీ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఒకవేళ ఎవరైనా సిబ్బంది తప్పు చేసినట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు పారదర్శకంగా వైద్య సేవలు అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని బొంతు రమణ విజ్ఞప్తి చేశారు.
ప్రజల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు స్పందిస్తుందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతి, లంచాల వ్యవహారాలను అరికట్టేందుకు పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.