పెట్టుబడుల ఆకర్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి
*సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశాలు
విశాఖపట్నం, మే 13 ః జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగు హాలులో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులతో కలిసి పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, భూసేకరణ, మౌలిక వసతుల అభివృద్ధి, ఎంవోయూల అనంతర చర్యలు తదితర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందాలు (MOUs), వాటి ప్రగతి, గ్రౌండింగ్ దశలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణ పనుల స్థితిగతులపై అధికారులు సమగ్ర వివరాలు అందించాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా భూ బ్యాంక్‌ను గుర్తించి ప్రభుత్వ భూములతో పాటు అవసరమైతే ప్రైవేటు భూములను కూడా సమీకరించే అవకాశాలను పరిశీలించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అనువైన భూభాగాలను ముందుగానే గుర్తించి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.
పెట్టుబడిదారులతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ వారికి అనుకూల వాతావరణం కల్పించాలని, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సింగిల్ విండో సేవలను సమర్థవంతంగా అమలు చేస్తూ పరిశ్రమల స్థాపనకు ఎదురయ్యే ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలన్నారు. వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టుల అమలులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యాటక, ఐటీ, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను వినియోగించుకోవాలని, భాగస్వామ్య సదస్సులో జరిగిన అవగాహన ఒప్పందాల ద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే దిశగా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. రాబోయే పరిశ్రమలు, టూరిజం ప్రాజెక్టులు, ఐటీ కంపెనీల వివరాలను సేకరించాలని, వాటికి ఎలాంటి చోట ఏయే భూములు అవసరమో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో గుర్తించిన భూభాగాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. సీఐఐ, ఎస్.ఐ.పి.బి. అనుమతులు పొందిన ప్రాజెక్టుల ఏర్పాటులో వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, ఆర్డీవోలు సంగీత్ మాధుర్, శేషశైలజ, ఏపీఐఐసీ జెడ్ఎం సింహాలచం, పరిశ్రమల శాఖ జీఎం ఆదిశేషు, టూరిజం అధికారిణి మాధవి, వీఎంఆర్డీఏ ఎస్టేట్ అధికారి దయానిధి, ఏడీసీ సత్యవేణి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.