మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
లక్కవరపుకోట దివ్యదర్శని
ఎల్.కోట: విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికతతో కూడిన భోజనం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేర్కొన్నారు. గురువారం ఆమె స్థానిక లక్కవరపుకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, ప్రభుత్వం అమలు చేస్తున్న 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం' నిర్వహణను, భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాఠశాల వంటగదిని, స్టోర్ రూమ్‌ను తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న అన్నం, కూరలు, ఇతర పదార్థాల నాణ్యతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వంట చేసే ప్రదేశంలో పరిశుభ్రతను పాటిస్తున్నారా? లేదా? అన్న విషయాలను స్వయంగా గమనించారు.
పాఠశాల సిబ్బందితో మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదు. మెనూ ప్రకారం రుచికరమైన, పౌష్టికాహారాన్ని అందించాలి. ఆహారం వడ్డించే సమయంలోనూ, వంట గదిలోనూ అత్యున్నత ప్రమాణాలు పాటించాలి అని ఆదేశించారు.
అంతేకాకుండా, విద్యార్థులతో మాట్లాడి భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు..
ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ చొక్కాకుల మల్లు నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు కరెడ్ల ఈశ్వరరావు, మాజీ ఎంపీపీ క్లస్టర్ ఇంచార్జీ కొల్లి రమణ మూర్తి, AMC డైరెక్టర్ పుట్టా శ్రీనివాసరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.