మహిళలను కించపరచడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది
పత్రికా ప్రకటన
వైసీపీ నాయకులకు మహిళల పట్ల కించిత్ గౌరవం భావం కూడా లేదు. సభ్యసమాజం తలదించుకునేలా నిత్యం అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి వారిని అణగదొక్కాలని, కించపరచాలని చూస్తున్నారు. మహిళలను అవమానాలకు గురి చేయడం వైసీపీ డి.ఎన్.ఎ.లోనే ఉంది. సరిగ్గా మూడేళ్ల క్రితం (2023 జూన్ 16) బాపట్ల జిల్లా రేపల్లెకు చెందిన గౌడ కులానికి చెందిన పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్, ఆకతాయిల వేధింపుల నుంచి సోదరిని రక్షించుకునే క్రమంలో ప్రాణం పోగొట్టుకున్నాడు. ఒక వైసీపీ నేత మరో ముగ్గురితో కలిసి పెట్రోల్ పోసి ఆ బాలుడిని ఘోరంగా చంపేశారు. హత్య చేసిన నిందితులు బెయిల్ పై బయటకు వచ్చి రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారు. శాంతిభద్రతల వైఫల్యానికి.. మహిళల అభద్రతకు ఈ సంఘటన ప్రత్యక్ష సాక్షి. తన దగ్గర పనిచేసే డ్రైవర్ ను ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేశారు. సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన వారికి కొమ్ము కాస్తూ హత్య కేసు జగన్ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. చెల్లిని కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. నా ఎస్సీలు, నా బీసీలు అంటూ కపట ప్రేమ కురిపిస్తూ అయిదేళ్ల పాటు వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన దౌర్జన్య చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కూటమి హయాంలో ఇలాంటి హేయమైన సంఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాం. హోం మంత్రి అనితను టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దిగజారుడు వ్యాఖ్యలు యావత్ మహిళా జాతిని అవమానపరిచాయి. అమర్ పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.