మారుమూల పల్లెల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా
రాజ్యాంగ స్ఫూర్తి పరిరక్షణకు ఆదివాసులకు పిలుపు
అల్లూరి జిల్లా/పెదబయలు, ఏప్రిల్ 14:
మారుమూల ప్రాంతాల్లోనూ సామాజిక చైతన్యం వెల్లివిరుస్తున్న నేపథ్యంలో గోమంగి సచివాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామం పండగ వాతావరణంలో కళకళలాడింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ జయంతిని మారుమూల ప్రాంతాల్లో కూడా ఘనంగా జరుపుకోవడం ఎంతో శుభప్రదమని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలు, ఆయన చూపిన మార్గం మన సమాజానికి దిక్సూచి అని, వాటిని ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.
అలాగే, భారత రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన హక్కులు, చట్టాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో చట్టాల అమలుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ వేడుకల్లో పెదబయలు జడ్పిటిసి సభ్యులు బొంజుబాబు, గోమంగి మండల సాధన సమితి అధ్యక్షులు చల్లంగి ఉమామహేశ్వరరావు, చింతపల్లి జిసిసి మేనేజర్ చల్లంగి సుగునాదం, మాజీ సర్పంచ్ కొర్ర సత్తిబాబు, గుల్లేలి సర్పంచ్ జమ్మనాయుడు, వైద్యుడు సిహెచ్ చైతన్య, మండల సమితి ఉపాధ్యక్షులు రాధాకృష్ణ, ఉపసర్పంచ్ మత్స్యకొండ బాబు, టిడిపి నాయకులు గంపరాయి ధనంజయ్, గిరిజన సంఘం జిల్లా నాయకులు జంపరంగి సునీల్, జనసేన పార్టీ నాయకులు కృష్ణ బాబు, వైసీపీ సీనియర్ నాయకులు కొమ్మ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే పలువురు స్థానిక నాయకులు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మారుమూల పల్లెల్లో కూడా అంబేద్కర్ జయంతి పట్ల కనిపిస్తున్న ఉత్సాహం, ఆయన ఆలోచనల పట్ల ప్రజల్లో పెరుగుతున్న చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.