అనకాపల్లి డిడి న్యూస్ పత్రికా ప్రకటన
వెంకమ్మ కృష్ణ సాగరం చెరువుకు పూర్వవైభవం
జె.వి.పాలెం రైతన్నల సాగు కష్టాలకు శాశ్వత పరిష్కారం
జలధార - జలహారతి' కార్యక్రమంలో భాగంగా పనులు వేగవంతం
అనకాపల్లి, మే 05: అనకాపల్లి జిల్లా జిల్లా ఎస్.రాయవరం మండలంలోని జంగులూరు వెలంపాలెం గ్రామ రైతాంగానికి దశాబ్దాల కాలంగా కలగా మిగిలిన సాగునీటి కల సాకారం కాబోతోంది. చారిత్రాత్మకమైన వెంకమ్మ కృష్ణ సాగరం చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టడం ద్వారా ఆ ప్రాంత వ్యవసాయ ముఖచిత్రం పూర్తిగా మారనుంది. ఒకప్పుడు జలకళతో అలలాడిన చెరువు, కాలక్రమేణా పూడికతో నిండిపోయి తన ఉనికిని కోల్పోయింది. సుమారు 145 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు గర్భం అంతా మట్టితో నిండిపోవడంతో, వర్షాలు కురిసినా నీటిని నిల్వ చేసే సామర్థ్యం లేక అటు సాగునీరు అందక, ఇటు భూగర్భ జలాలు పెరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా 145 ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ చెరువు కింద పంటలు పండించడం రైతులకు గగనంగా మారింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జలధార - జలహారతి' కార్యక్రమం లో భాగంగా వెంకమ్మ కృష్ణ సాగరం చెరువుకు కొత్త జీవం పోస్తోంది. చెరువు గర్భంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను తొలగించడంతో పాటు, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. కేవలం పూడిక తీతకే పరిమితం కాకుండా, చెరువు గట్లను పటిష్టం చేయడం ద్వారా నీటి వృథాను అరికట్టాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆయకట్టుకు నీరు చేరే ప్రధాన కాలువలను కూడా ఆధునీకరిస్తుండటంతో, చివరి ఎకరం వరకు సాగునీరు అందుతుందనే ధీమా రైతుల్లో వ్యక్తమవుతోంది. ఈ పునరుద్ధరణ పనుల వల్ల కేవలం 150 ఎకరాలకు సాగునీరు మాత్రమే కాకుండా, చుట్టుపక్కల బావులు మరియు బోర్లలో నీటి మట్టం గణనీయంగా పెరిగి తాగునీటి సమస్య కూడా పరిష్కారం కానుంది. ఈ మార్పు జంగులూరు, వెలంపాలెం బాటలు వేయనుంది. దిగువ గ్రామాలు ఆర్థిక స్థిరత్వానికి బాటలు వేయనుంది. 150 ఎకరాల పంట భూమిలకు మరియు ఇప్పుడు రెండు పంటలకు సరిపడా నీరు అందే అవకాశం ఉండటంతో, దిగుబడి పెరిగి రైతు కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి. పూడిక మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకోవడం ద్వారా భూమి సారవంతం కావడం మరో విశేషం. వెరసి, వెంకమ్మ కృష్ణ సాగరం చెరువు కేవలం ఒక నీటి వనరుగా మాత్రమే కాకుండా, వందలాది రైతు కుటుంబాల జీవనాధారంగా అవతరిస్తోంది. ఎస్ రాయవరం మండలంలోని ఇతర గ్రామాలకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది ఈ పునరుద్ధరణ పనుల పట్ల గ్రామస్తులు మరియు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.