టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు విన్న హోంమంత్రి వంగలపూడి అనిత
రాష్ట్ర నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన బాధితులు
ప్రజల వినతులను స్వయంగా స్వీకరించి, ఓపిగ్గా సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి
అక్కడిక్కడే అధికారులతో ఫోన్‌లో మాట్లాడి బాధితులకు తక్షణ పరిష్కారం చూపిన అనిత
గ్రీవెన్స్‌లో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ
ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారు నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన 'గ్రీవెన్స్ సెల్' కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజల నుండి ఆమె వినతులను స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి హోంమంత్రి గారు అక్కడికక్కడే స్పందించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల సమస్యలపై సంబంధిత జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. పోలీస్ యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, బాధితులు మళ్లీ మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు, వేధింపులకు గురైన బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. పలువురు సామాన్యులు తమ భూములను కబ్జా చేశారని, పోలీసుల సహాయం అందడం లేదని మొరపెట్టుకున్నారు. మహిళలపై జరుగుతున్న అక్రమాలు, వేధింపులపై ఫిర్యాదులు రాగా.. మహిళా భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి హామీ ఇచ్చారు.